"రామన్న రాముడూ కోదండ రాముడూ శ్రీరామచంద్రుడు వచ్చాడురా.. మన సీతమ్మ తల్లితో వచ్చాడురా.." అంటూ శ్రీరామ పట్టాభిషేకంతో మొదలైన ఉత్తర రామాయణ గాథను వెండితెరపై చూస్తూ జనం మైమరచి, పులకించి, పులకరించిపోయి ఇవాళ్టికి 60 వసంతాలు గడిచిపోయాయి. అవును. సమ్మోహనాకారుడు నందమూరి తారకరామారావు జనం గుండెల్లో శ్రీరామచంద్రునిగా నిలిచిపోవడానికి కారణభూతమైన మహోన్నత పౌరాణిక చిత్రం 'లవకుశ' విడుదలైంది 60 ఏళ్ల క్రితం.. అనగా 1963 మార్చి 29న. ఎన్టీఆర్ కాకుండా ప్రపంచంలోని ఇంకే ప్రాంతంలోనూ ఒక నటుడు శ్రీరాముని రూపంతో జనం చేత కొలవబడ్డ దాఖలా మరిలేదు, ఇంకరాదు కూడా. అలాంటి సుందరరూపుడు తారకరాముడు!
సీతగా అంజలీదేవి సైతం తెలుగువారికి ఆరాధ్యురాలైంది కూడా 'లవకుశ' చిత్రంతోటే. సీతారాములుగా అంజలి, రామారావు జోడీకి అంతగా జనం తమ మనసుల్లో గుడి కట్టేశారు. వారు ఎక్కడికి కలిసి వెళ్లినా హారతులు పట్టారు. లక్ష్మణునిగా కాంతారావు అతికినట్లు సరిపోయిన ఈ సినిమాలో భరత, శతృఘ్నులుగా కైకాల సత్యనారాయణ, శోభన్‌బాబు నటించగా, రాజగురువు వశిష్ట ముని పాత్రలో ధూళిపాళ వారు ఒదిగిపోయారు. ఇక టైటిల్ రోల్స్ లవకుశులుగా అప్పటి బాలనటులు నాగరాజు, సుబ్రహ్మణ్యం ఎంతగా జన హృదయాల్ని దోచుకున్నారో కదా! కన్నాంబ, రేలంగి, గిరిజ, సూర్యకాంతం, రమణారెడ్డి లాంటి వాళ్లు తమ పాత్రల్లో చులాగా ఒదిగిపోయి రాణించిన తీరు ఎంత గొప్పది! అప్పటి దాకా అనేక సినిమాల్లో తన నటనతో నవ్వులు పూయిస్తూ వచ్చిన రేలంగి వెంకట్రామయ్య ఈ సినిమాలో సీతమ్మ అడవుల పాలవడానికి కారకుడైన తిమ్మడి పాత్రను చేసి, ఎంతమంది జనాల తిట్లకు గురయ్యారో!! సీతమ్మకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చి లవకుశులను గొప్ప విలుకాండ్లుగా తీర్చిదిద్దే వాల్మీకి మహర్షి పాత్రలో చిత్తూరు నాగయ్యను కాకుండా మరొక నటుణ్ణి ఊహించుకోగలమా!
తండ్రీకొడుకుల ప్రేమానురక్తికీ, భార్యాభర్తల అనురాగానికీ, అన్నాతమ్ముళ్ల అనుబంధానికీ, అత్తాకోడళ్ల ఆత్మీయ స్ఫూర్తికీ అద్దంపట్టే 'లవకుశ'ను తండ్రీకొడుకులు సి. పుల్లయ్య, సి.యస్. రావు మహోన్నత కళాఖండంగా సెల్యులాయిడ్‌పైకి తీసుకు వచ్చారు. సదాశివ బ్రహ్మం రచించిన సంభాషణలు, సముద్రాల రాఘవాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, సదాశివబ్రహ్మం కలాల నుంచి జాలువారిన పాటలు ఆడియో క్యాసెట్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టించాయి. పానుగంటి, కంకటి పాపరాజు రచించిన పద్యాలను అదే పనిగా వల్లెవేసిన వారి సంఖ్య తక్కువా! ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే, రామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా, రామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమ, వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మా, వల్లనోరి మావా నీ పిల్లని, నేనొల్లనోరి మావా నీ పిల్లని.. ఏం పాటలివి.. ఎంతటి మనోజ్ఞమైన రాగాలవి..! ఇదంతా ఘంటసాల కూర్చిన స్వరాలు, పి. సుశీల, పి. లీల, జిక్కి, జె.వి. రాఘవులు, రాణి, వైదేహి, పద్మ మల్లిక్ లాంటి వారితో కలిసి ఆయన చేసిన ఆలాపన మహిమే కదా!! సినిమా ఇంత ఘన విజయం సాధించడంలో సన్నివేశాలను అంత సుందరంగా, ప్రభావవంతంగా తన కెమెరాతో తీసిన పి.ఎల్. రాయ్ చాయాగ్రహణ ప్రతిభ కూడా కచ్చితంగా ఉంది.
ఇక ఈ సినిమా నిర్మాణ విషయానికి వస్తే.. లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించిన 'లవకుశ' షూటింగ్ 1958లో మొదలు కాగా, ఆర్థిక సమస్యలతో సినిమా చిత్రీకరణ 5 సంవత్సరాల పాటు కొనసాగింది. సినిమా ప్రారంభించినప్పుడు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్య అనారోగ్యం పాలుకావడంతో ఆయన కుమారుడు సి.ఎస్. రావు పునఃప్రారంభం తర్వాత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. మొత్తానికి సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని 1963లో 26 కేంద్రాల్లో విడుదలైంది. సినిమా అపూర్వమైన వాణిజ్య విజయాన్ని సాధించింది. విడుదలైన అన్నికేంద్రాల్లో 150 రోజులు జరుపుకోవడంతో ప్రారంభించి 500 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా 'లవకుశ' చరిత్రకెక్కింది. రిపీట్ రన్ లోనూ ఈ చిత్రం స్థాయిలో ఆడిన చిత్రం మరొకటి లేదు. రిపీట్ రన్లోని ప్రదర్శనలన్నీ కలుపుకుంటే వందకు పైగా కేంద్రాల్లో ఏడాదిపైగా ఆడిన చిత్రంగా భారతదేశం మొత్తమ్మీద మరో రికార్డు స్వంతం చేసుకుంది. పావలా, రూపాయి టిక్కెట్లు ఉన్న రోజుల్లో సినిమా రూ. కోటి వసూళ్ళు సాధించడం ఒక చరిత్ర. విడులైన అన్ని కేంద్రాల్లోని జనభా 60 లక్షల మంది కాగా, 1.98 కోట్ల టిక్కెట్లు అమ్ముడుకావడం అపూర్వ ఘట్టం. సినిమా తమిళ వెర్షన్ 40 వారాలు ఆడగా, హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.
'లవకుశ' సినిమా తెలుగు సినిమాలపైనే కాక తెలుగువారిపైనా తన ప్రభావాన్ని చూపించింది. తెలుగు గ్రామాల్లోని రామాలయాల్లో ఈ సినిమా పాటలు మారుమోగి తెలుగునాట 'లవకుశ' పాటలు వినిపించని గ్రామమే లేదన్నంత స్థాయి ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాయి. ఆ కాలంలో తెలుగు గ్రామాల్లో శ్రీరామనవమి సహా ఏ ఉత్సవం చేసినా ఊరికి బాక్సు తీసుకువచ్చి సినిమాలు వేసే క్రమంలో 'లవకుశ' సినిమాను వేయడమన్నది ఒక రివాజుగా మారింది.